ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహాయుతి కూటమి కీలక సమావేశం శుక్రవారం జరుగాల్సి ఉంది. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనూహ్యంగా సతారా జిల్లాలోని తన గ్రామానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో మహాయుతి కూటమి కీలక సమావేశం రద్దైంది. (Mahayuti meet called off) దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో అనిశ్చితి నెలకొన్నది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో కలిసి శివసేనకు చెందిన షిండే ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను వారు కలిశారు. మహాయుతి కూటమి నేతృత్వంలో మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించారు. అంతా సానుకూలంగా ఉందని షిండే అన్నారు.
కాగా, సీఎం పదవి రేస్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ ముందున్నారు. అయితే మహాయుతి కూటమి ప్రభుత్వానికి ఎవరు సారధ్యం వహిస్తారు, క్యాబినెట్ బెర్త్‌ల పంపకంపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో వీటిపై చర్చించేందుకు శుక్రవారం ఉదయం ముంబైలో మహాయుతి కూటమి కీలక సమావేశం జరుగనున్నది. అయితే అనూహ్యంగా సతారా జిల్లాలోని తన గ్రామానికి షిండే వెళ్లారు. దీంతో మహాయుతి కూటమి కీలక సమావేశం రద్దయ్యింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతున్నది.