Actor Vijay : తమిళనాడు (Tamil Nadu) కు చెందిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు (TVK Chief) విజయ్ (Vijay) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారంలో జోరు పెంచారు. శనివారం తమక్కల్ (Thamakkal) జిల్లాలోని వెస్టర్న్ కొంగు (Western) రీజియన్లో విజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే (DMK) పైన, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) పైన విమర్శల వర్షం కురిపించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని విజయ్ అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో స్టాలిన్ ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని ఆరోపించారు. పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం డీఎంకే నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఇలాంటి అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహించొద్దని ప్రజలకు సూచించారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికార డీఎంకే ఇప్పటికీ అమలు చేయలేకపోయిందని విజయ్ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే నేతలు కూడా తమ నాయకురాలు జయలలిత ఆదర్శాలను మరిచిపోయారని ఎద్దేవాచేశారు. పైకి ‘అమ్మ’ పేరును జపిస్తున్నప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి రహస్యంగా చర్చలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు తమిళనాడుకు రాష్ట్రానికి చేసిన మేలు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. తమిళగ వెట్రి కళగం పార్టీ ప్రజల అభివృద్దికి కృషి చేస్తుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రధాన పోరు టీవీకేకు, డీఎంకేకు మధ్య జరగనుందన్నారు. కాగా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కొత్తగా ఏర్పాటైన టీవీకేతో సహా ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టాయి.