న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల కారణంగా భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ఈ ఏడాది అర్ధశాతం తగ్గవచ్చని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ తెలిపారు. ఈ అదనపు సుంకాలు స్వల్పకాలిక పరిణామం అవుతుందన్న ఆశాభావాన్ని బ్లూమ్బర్గ్ టీవీకి చెందిన హస్లిండా అమీన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ అదనపు సుంకాలు ఎంతకాలం ఉంటాయన్న అంశాన్ని పక్కనపెడితే దీని ప్రభావం భారత జీడీపీపై 0.5 శాతం నుంచి 0.6 శాతం వరకు ఉండవచ్చని ఆయన చెప్పారు. అయితే ఈ సుంకాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగితే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉండి భారత్కు ప్రధాన ముప్పుగా పరిణమించవచ్చని ఆ యన ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 2026తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ పెరుగుదల 6.3 శాతం-6.8 శాతం ఉంటుందన్న ప్రభుత్వ అంచనాకు తాను కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు.