న్యూఢిల్లీ : ట్రంప్ ప్రభుత్వం (Donald Trump) మరోసారి ఇమిగ్రేషన్ నిబంధనల (Immigration) అమలును కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ఈసారి విదేశీ విద్యార్థులను అమెరికా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్(ఓపీటీ) ప్రోగ్రామ్ కింద ప్రత్యేకంగా రెండేళ్ల స్టెమ్-ఓపీటీ పొడిగింపులో ఉన్న విదేశీ విద్యార్థుల నివాసాలను ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు 3.3 లక్షలకు పైగా ఉండగా వీరిలో ఓపీటీలో 97,500 మంది నమోదై ఉన్నారు. ప్రభుత్వ తాజా చర్య భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ)కి చెందిన ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ(ఎఫ్డీఎన్ఎస్) నుంచి అధికారులు విదేశీ విద్యార్థుల నివాసాలు, హాస్టళ్లను అప్రకటితంగా సందర్శిస్తున్నట్లు ఇమిగ్రేషన్ న్యాయవాదులు, విద్యార్థులు వెల్లడించారు.
వీసా నిబంధనలను విదార్థులు పాటిస్తున్నదీ లేనిదీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. విద్యార్థి చదువుతున్న చదువుకు, ఫామ్ I-983 కింద తీసుకున్న శిక్షణ ప్రణాళికకు పొంతన ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయడంతోపాటు వ్యాలీడ్ ఎఫ్-1 స్టేటస్‌ని నిర్వహిస్తున్నదీ లేనిదీ అధికారులు చూస్తున్నారు. ఈ తనిఖీల సందర్భంగా అధికారులు ధ్రువీకరణ పత్రాలతోపాటు కొన్ని కీలక ప్రశ్నలు సంధిస్తున్నారు. ఉద్యోగ విధులేమిటి, అవి విద్యార్థి డిగ్రీకి ఏ విధంగా సంబంధించినవి, పని గంటలు, జీతం, శిక్షణ లక్ష్యాలు, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) నిబంధనలు, హాజరు, విద్యార్హతలు వంటి ప్రశ్నలు విద్యార్థులకు అధికారుల నుంచి ఎదురవుతున్నాయి.
విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలపై నిపుణులు అనేక సూచనలు అందచేస్తున్నారు. I-1983 ఫారమ్‌ని విద్యార్థులు అప్డేట్గా ఉంచుకోవాలి. ఉద్యోగ లేక చిరునామా మార్పులను యూఎస్‌సీఐఎస్‌కి, డిజిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్(డీఎస్ఓ)కి ఎప్పటికప్పుడు తెలియచేయాలి. ఐడీ, ఆఫర్ లెటర్లు, పే స్లిప్స్, ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన రికార్డులు భద్రంగా ఉంచుకోవాలి. తనిఖీ అధికారి గురించి తెలుసుకుని ప్రశ్నలకు నిజాయితీగా జవాబులివ్వాలి.