ఇంఫాల్: మణిపూర్‌లో హింస కొనసాగుతున్నది. నిత్యవసరాలు సరఫరా చేసే వాహనాలకు నిప్పుపెట్టారు. (Trucks Set On Fire) రాజధాని ఇంఫాల్‌ను అస్సాం సరిహద్దులోని జిరిబామ్ జిల్లాను కలిపే జాతీయ రహదారి 37పై ఈ సంఘటన జరిగింది. బియ్యం, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి కూరగాయలు, నిత్యావసర వస్తువులను లాంగ్మై, నోనీ, తమెంగ్లాంగ్ జిల్లాలకు పలు లారీల్లో తరలిస్తున్నారు. నోనీ జిల్లాలో సాయుధులైన కొందరు వ్యక్తులు కాల్పులు జరిపి వాహనాలను అడ్డుకున్నారు. రెండు లారీలకు నిప్పుపెట్టారు.
కాగా, మణిపూర్‌లోని మైతీ, కుకీల మధ్య ఘర్షణకు దూరంగా ఉన్న నాగా తెగ ఈ సంఘటనపై స్పందించింది. కుకీ మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడినట్లు రోంగ్మీ నాగా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మణిపూర్ ఆరోపించింది. నోనీ, తమెంగ్లాంగ్ జిల్లాలోని కుకీ స్థావరాలకు వెళ్లే అన్ని సరఫరాలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.
మరోవైపు కుకీ తెగలు నివసించే చురచంద్‌పూర్, ఇతర మారుమూల కొండ ప్రాంతాలకు నిత్యవసరాలు చేరకుండా మైతీ గ్రూపులు అడ్డుకుంటున్నాయని కుకీ సంఘాలు ఆరోపించాయి. నిత్యవసర సరుకులను తరలించే లారీలను ఆపివేస్తున్నారని మండిపడ్డాయి.