Madya Pradesh | భోపాల్, జూలై 21: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. తాము లీజుకు తీసుకున్న భూమిలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నించిన ఇద్దరు మహిళలపై కొందరు డంపర్ ట్రక్కు ద్వారా మట్టి పోసి వారిని సజీవ సమాధి చేసేందుకు ప్రయత్నించారు. స్థానికులు వెంటనే వారిని బయటకు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. రేవా జిల్లాలోని హినొతా జోరత్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తమ భూమి నుంచి రోడ్డు వేయడానికి వీలులేదని మమత పాండే, ఆశా పాండే అనే మహిళలతో పాటు మరికొందరు గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. అయితే వారి నిరసనలు పట్టించుకోకుండా ట్రక్కు ద్వారా మట్టిని పొలంలో వేసేందుకు రాగా, వారు తమ పొలంలోనే బైఠాయించారు. అయితే అవేమీ పట్టించుకోకుండా స్థానికంగా ఉండే కొందరి పెద్దల ప్రోత్సాహంతో ట్రక్కు వెనుక ఉన్న వారిపై డైవర్ మట్టిని అన్లోడ్ చేయడంతో వారు అందులో పీకల్లోతు కూరుకుపోయారు. చుట్టుపక్కల వారు కేకలు పెడుతూ వచ్చి వారిని రక్షించారు.