న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాలకు సంబంధించిన నోటీసులు ఇచ్చింది. ధాన్యం సేకరణలో జాతీయ విధానం, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారంపై చర్చించాలని రాజ్యసభలో ఎంపీ కే కేశవరావు, లోక్సభలో నామా నాగేశ్వరరావు నోటీసులు ఇచ్చారు.
ధాన్యం సేకరణలో జాతీయ విధానం ప్రకటించాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి ధాన్యం ఎంత సేకరిస్తారో స్పష్టం చేయాలని, ధాన్యం పండించిన రైతులకు అన్యాయం చేయవద్దని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నిన్న ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగి తమ నిరసనను వ్యక్తం చేశారు. సెంట్రల్ హాల్, గాంధీ విగ్రహం వద్ద కూడా నిరసన తెలిపారు. కేంద్రం దిగి వచ్చి స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు.