న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన లోక్‌సభను షేక్ చేసింది. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. తెలంగాణ బచావో అంటూ స్పీకర్ పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. కనీస మద్దతు ధరను చట్టబద్దం చేయాలని డిమాండ్ చేశారు. వరిధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. టీఆర్ఎస్ ఎంపీలతో పాటు ఇతర పార్టీల ఆందోళనలతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. రాజ్యసభ నుంచి మిగతా ఎంపీలతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు కూడా వాకౌట్ చేశారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష ఎంపీలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శీతాకాల సమావేశాలను విపక్షాలు బహిష్కరించే అవకాశం ఉంది.