Vikram Misri | న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ముగిసి కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని శనివారం మధ్యాహ్నం ఇలా ప్రకటించారో లేదో, యుద్ధం ద్వారా పాకిస్థాన్ పీచమణచాలని కోరుకుంటున్న పలువురు పౌరులు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై సామాజిక మాధ్యమంలో పెద్దయెత్తున ట్రోలింగ్‌ను ప్రారంభించారు. ఈ ట్రోలింగ్‌లో విదేశాల్లో ఉన్న అమె కుమార్తెను కూడా లాగి కొందరు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ట్రోలింగ్‌ను తట్టుకోలేక ఆయన తన అకౌంట్‌ను లాక్ చేసుకున్నారు.
కాగా, మిస్రీకి రాజకీయే నేతలు అఖిలేశ్ యాదవ్, అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు దౌత్యవేత్తలు మద్దతు తెలిపారు. మిస్రీని ఆయన కుటుంబాన్ని, ముఖ్యంగా ఆయన కుమార్తెను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమంలో పలువురు ట్రోలింగ్ చేయడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ తీవ్రంగా ఖండించారు. ఇది భయంకరమైనది, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానిదంటూ ఢిల్లీ కేంద్రంగా ఉన్న భారత దౌత్యవేత్తల సంఘం పేర్కొంది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నెటిజన్ల వ్యాఖ్యలు దేశం కోసం అహర్నిశలు పాటు పడుతున్న నిజాయితీ గల అధికారుల ఆత్మైస్థెర్యం దెబ్బతీస్తాయని అఖిలేశ్ యాదవ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ప్రధాన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందే తప్ప వ్యక్తిగతంగా అధికారులు తీసుకున్నవి కావన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కొందరు నెటిజన్లు తమ హద్దులు దాటి మిస్రీని, ఆయన కుటుంబ సభ్యులను దారుణంగా ట్రోలింగ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది నిజంగా అవమానకరమని అన్నారు. రాజకీయంగా, కార్యనిర్వాహకంగా తీసుకునే నిర్ణయాలపై ఒక నిజాయితీ గల అధికారిని విమర్శించడం తగదని ఒవైసీ అన్నారు.