Triple Talaq | న్యూఢిల్లీ, ఆగస్టు 19: వివాహ వ్యవస్థకు “ట్రిపుల్ తలాక్’ అనేది ప్రమాదకరమైన ఆచారమని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ట్రిపుల్ తలాక్ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 2017లో ఈ ఆచారాన్ని సుప్రీంకోర్టు పక్కకు పెట్టినప్పటికీ అది ట్రిపుల్ తలాక్‌తో చేసుకునే విడాకులను తగ్గించేందుకు సరైన నిరోధకత కాలేకపోయిందని తెలిపింది.
ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు పొందుతున్న ముస్లిం వివాహితల హక్కులను కాపాడేందుకు పార్లమెంటు ఈ చట్టం చేసినట్టు పేర్కొన్నది. ఈ చట్టం ముస్లిం వివాహితలకు లింగ సమానత్వం, న్యాయం కల్పిస్తున్నదని, వివక్షను రూపుమాపేందుకు, వారి సాధికారతకు ప్రాథమిక హక్కులను కాపాడుతున్నదని తెలిపింది. 2017 ఆగస్టు 22న ట్రిపుల్ తలాక్‌ను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. తర్వాత కేంద్రం ముస్లిం మహిళా(వివాహంపై హక్కుల రక్షణ) చట్టం చేయగా, పలు ముస్లిం సంస్థలు ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టును ఆశ్రయించాయి.