న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఉపాధి హామీ పథకం కింద పశ్చిమ బెంగాల్‌కు రావాల్సిన 15వేల కోట్ల రూపాయల్ని కేంద్రం విడుదల చేయటం లేదంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. ఎంపీ అభిషేక్ బెనర్జీ నేతృత్వంలో సోమవారం న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద సాగిన నిరసన కార్యక్రమానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఎంపీ అభిషేక్ బెనర్జీ నలుపు రంగు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, బెంగాల్‌కు నిధులు విడుదల చేయాలని, లక్షా 15వేల కుటుంబాలకు చెందిన రూ.15వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని మోదీ సర్కార్‌ను డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, పీఎం ఆవాస్ యోజన పథకాల కింద పశ్చిమ బెంగాల్‌కు రావాల్సిన నిధులను కేంద్రం కావాలనే అడ్డుకుంటున్నదని గత కొంత కాలంగా అధికార తృణమూల్ పార్టీ ఆరోపిస్తున్నది. ‘ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చుతున్నది. రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకొని పథకాల్ని అమలుజేస్తున్నది. ఇది ప్రజాస్వామ్యమా? పేద ప్రజల్ని, మహాత్మాగాంధీని అవమానించటం కాదా?’ అని తృణమూల్ పార్టీ అధికార ప్రతినిధి బిశ్వజిత్ దేవ్ విమర్శించారు.