న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్, అధికార తృణమూల్ కాంగ్రెస్ మధ్య వివాదం మరింత ముదిరింది. సీఈసీతో టీఎంసీ సమావేశం రసాభాసగా మారింది. సీఈసీ తమను ‘వెళ్లి పోండి’ అని అవమానకరంగా మాట్లాడారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియాన్ బుధవారం ఆరోపించారు. ‘ఏడు నిమిషాల సమావేశంలో సీఈసీ మమల్ని వెళ్లి పోండి అని చెప్పారు. కాబట్టి మేం బయటకు వచ్చేశాం. పార్లమెంట్లో మేం రెండో అతి పెద్ద విపక్షం’ అని ఆయన తెలిపారు. తమ అధినేత్రి ఈసీకి రాసిన తొమ్మిది లేఖలను తీసుకొని వాటికి సమాధానం కోసం సీఈసీని కలిశామని ఆయన వెల్లడించారు.
‘ఎన్నికల నైతిక నియమావళి అమల్లోకి వచ్చాక ఉన్నతాధికారులను ఎందుకు బదిలీ చేశారని.. ఇలా అయితే మీరు స్వేచ్ఛగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు’ అని తాము సీఈసీని అడిగామని ఓబ్రియాన్ తెలిపారు. అయితే దీనికి ఆయన స్పందిస్తూ ‘ఇక్కడ నుంచి వెళ్లి పోండి’ అని అన్నారని.. ఇది అవమానకరమని తెలిపారు. దీనిపై ఈసీ వర్గాలు స్పందిస్తూ ఓబ్రియాన్ సీఈసీ మీద అరిచారని.. మాట్లాడొద్దని అన్నారని తెలిపాయి. ‘అరవడం, అమర్యాదక ప్రవర్తన సరైంది కాదు’ అని ఈసీ తెలిపింది. ఆ తర్వాత మరొక ఎక్స్ పోస్ట్‌లో టీఎంసీకి ఈసీ అల్టిమేటం జారీ చేసింది. ‘టీఎంసీకి నేరుగా హెచ్చరిక. ఈసారి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలను భయం, హింస, బెదిరింపులు, ప్రలోభాల రహితంగా నిర్వహిస్తాం. ఎలాంటి దాడులు, బూత్ జామింగ్, వనరుల అడ్డగింతలు లేకుండా పోలింగ్ కొనసాగిస్తాం’ అని పేర్కొన్నది. ఈసీ ప్రకటనను టీఎంసీ ఎంపీలు ఖండించారు. తమతో జరిగిన సమావేశం ఆడియో లేదా వీడియోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.