కోల్‌కతా, డిసెంబర్ 6: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కోల్‌కతాను చెత్తనగరంగా పేర్కొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రపంచంలో చెత్త నగరాల పోటీ పెడితే కోల్‌కతా మొదటి స్థానంలో నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రిజు దత్త స్పందిస్తూ.. ‘రేవంత్ రెడ్డివి అసంబద్ధ వ్యాఖ్యలు. కోల్‌కతా ఆనందాల నగరం. భారత్‌కు సాంస్కృతిక రాజధాని. ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఆయన(రేవంత్ రెడ్డి) ఓసారి కోల్‌కతా వచ్చి నగరం ఎంత పరిశుభ్రంగా, సుందరంగా ఉందో చూడాలి’ అని పేర్కొన్నారు. ‘ఇలాంటి అసత్య వ్యాఖ్యలపై మాకు స్పందించాల్సిన అవసరం లేదు. దేశంలోని పరిశుభ్రమైన నగరాల్లో కోల్‌కతా ఒకటి’ అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డోలాసేన్ వ్యాఖ్యానించారు.