న్యూఢిల్లీ, డిసెంబర్ 30 : బ్రహ్మోస్ ఏరోస్పేస్ డైరెక్టర్ జనరల్, సీఈవో జైతీర్థ్ ఆర్ జోషిని ఆ పదవి నుంచి తొలగించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ (సీఏటీ) ఆదేశించింది. అంతేకాకుండా ఈ పదవికి సీనియర్ సైంటిస్ట్ శివరామ సుబ్రహ్యణ్యం నంబీ నాయుడు పేరును పునః పరిశీలించాలని ఆదేశాలిచ్చింది. సీఈవోగా జోషి నియామకంలో విధానపరమైన లోపాలున్నాయని ఆరోపిస్తూ, ఆయన నియామకాన్ని నాయుడు క్యాట్‌లో సవాల్ చేశారు.
దీనిని విచారించిన ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో రక్షణ శాఖ, డీఆర్డీవోలు నాయుడు అభ్యర్థనను నాలుగు వారాల్లోగా పరిశీలించాలని పేర్కొంది. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆ పదవిలో కొనసాగడాన్ని నిషేధిస్తూ తదుపరి సీఈవో నియామకం వరకు ప్రస్తుత సీఈవో స్థానంలో ఇన్చార్జిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.