Gujarat | దాహూద్: ప్రధాని మోదీ స్వరాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒక గిరిజన మహిళను సాక్షాత్తూ ఆమె మామ, మరిది మరికొందరు కలిసి దౌర్జన్యం చేసి కొట్టి, అర్ధనగ్నంగా చేసి, చేతులు కట్టేసి వీధులలో ఊరేగించిన సంఘటన దాహూద్ జిల్లా సంజేలి తాలుకా గ్రామంలో ఈ నెల 28న జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆరోపణతో వారు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఈ సందర్భంగా 15 మందిపై కేసు నమోదు చేసి 12 మందిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ రాజ్‌దీప్‌సిన్హ్ జలా శుక్రవారం తెలిపారు.
అరెస్టయిన వారిలో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నెల 28న ఆమె మామ, మరిది మరికొంతమంది గ్రామస్థులు కలిసి మూకుమ్మడిగా ఆ వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. అక్కడ ఉన్న ఆమెను కొట్టి గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆమెను మోటారు సైకిల్‌కు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి ఒక ఇంటిలోని గదిలో బంధించారు. కాగా, గుజరాత్లో క్షీణిస్తున్న శాంతి భద్రతలపై విపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా విమర్శించాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.