ఛింద్వారా: మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో బుధవారం దారుణం జరిగింది. ఈ నెల 21న వివాహం చేసుకున్న వ్యక్తి కర్కశంగా తన భార్య సహా ఎనిమిది మందిని హత్య చేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బోడల్ కచ్చర్ గ్రామంలో నివసిస్తున్న దినేశ్ సరియమ్ (26) మంగళ-బుధవారాల మధ్య రాత్రి 2.30 గంటల సమయంలో దారుణానికి తెగబడ్డాడు. గొడ్డలితో విచక్షణ లేకుండా తన భార్య, తల్లి, సోదరి, సోదరుడు, వదిన, ముగ్గురు చిన్నారులను హత్య చేశాడు. మేనల్లుడిపై దాడి చేసినప్పటికీ, అతడు ఏదోవిధంగా తప్పించుకోగలిగారు. అనంతరం దినేశ్ ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాథమిక విచారణలో దినేశ్‌కు మానసిక అస్వస్థత ఉన్నట్లు తెలిసింది. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపించారు. గాయపడిన వ్యక్తిని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు.