భువనేశ్వర్, అక్టోబర్ 19: రాడార్ ప్రాజెక్టు వల్ల ఉనికి కోల్పోనున్న దామగుండం అడవిని కాపాడుకునేందుకు తెలంగాణలో సాగుతున్న ఆందోళన తరహాలో ఛత్తీస్గఢ్లో మరో ఆందోళన మొదలైంది. మైనింగ్ కోసం హస్దేవ్ అటవీ ప్రాంతంలో చెట్లను నరికేయడంపై ప్రజలు ఆందోళనకు దిగారు. అడవితల్లిని కాపాడుకునేందుకు ఆయుధాలు చేతపట్టి కదం తొక్కారు. చెట్లు నరికితే చూస్తూ ఊరుకోబోమని ప్రతిఘటించారు. దీంతో హస్దేవ్ అటవీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఈ ప్రాంతంలో పలు కోల్ బ్లాక్లను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అదానీ సంస్థకు అప్పగించింది. పర్స కోల్ బ్లాక్ కోసం దాదాపు 96 వేల చెట్లను నరికేసి మైనింగ్ మొదలు పెట్టేందుకు ఈ సంస్థ ప్రయత్నించింది. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా పర్స గ్రామస్థులు గురువారం ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. బాణాలు, ఉండేళ్లు, రాళ్లతో గ్రామస్థులు, లాఠీలతో పోలీసులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక సీఐ, ఒక ఎస్సై సహా ఆరుగురు పోలీసులు, 12 మంది గ్రామస్థులకు గాయాలయ్యాయి.