బెంగళూరు: బెంగళూరులో రోడ్ల దుస్థితి (Bengaluru Roads), ట్రాఫిక్ సమస్యలపై (Bengaluru Traffic) విమర్శల వర్షం కొనసాగుతూనే ఉన్నది. బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ వంటి ప్రముఖులు కూడా ఈ సమస్యలను లేవనెత్తారు. ఇక ఆన్లైన్ ట్రక్కింగ్ స్టార్టప్ బ్లాక్‌బక్ సీఈవో రాజేశ్ యాబాజీ ఏకంగా తమ ఆఫీస్‌ను బెంగళూరు నుంచి మార్చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో వ్యోమగామి శుభాన్షు శుక్లా (Subhanshu Shukla) కూడా చేరారు. అంతరిక్ష్యంలో ప్రయణించడమే తేలిక అంటూ బెంగళూరు రోడ్ల దుస్థితిపై కామెంట్ చేశారు.
దేశ ఐటీ రాజధానిలో జరిగిన బెంగళూరు టెక్నాలజీ సమ్మిట్ (BTS)లో ‘ఫ్యూచర్ మేకర్స్ కాంక్లేవ్’కు శుభాన్షు శుక్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను మారతహళ్లి నుంచి ఎగ్జిబిషన్ సెంటర్‌కు మూడు గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇందులో మూడో వంతు సమయంలో నే తాను ప్రసంగాన్ని పూర్తి చేశానంటూ వ్యాఖ్యానించారు. మారతహళ్లి నుంచి బీఈఎస్ వేదిక అయిన బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు మధ్య 34 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సాధారణంగా ఒక గంటలో ప్రయాణించవచ్చు.
గత జూన్‌లో యాగ్జియం మిషన్ ద్వారా చేపట్టిన అంతరిక్ష ప్రయాణంపై ఆయన మాట్లాడుతూ అంతరిక్షంలో అడుగుపెట్టాక మన గుండెపై మోటారు వాహనం ప్రయాణించినట్లు శుభాన్షు ఉంటుందన్నారు. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కనీసం వారం రోజులు పడుతుందని వివరించారు. భూమికి వచ్చాక రెండు వారాలపాటు మన శరీరం అదుపు తప్పే ఉంటుందని తెలిపారు. ఈ ప్రయాణం భారతీయ అంతరిక్ష విజయానికి ప్రతీక అని తెలిశాక గర్వంగా ఉందన్నారు. మనకు, మన అంతరిక్ష ప్రగతికి హద్దుల్లేవని వెల్లడించారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో వీడియోలో చూపించారు.