కోల్‌కతా, మే 15: అంబులెన్స్‌కు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో కన్న కొడుకు మృతదేహంతో ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించిన హృదయవిదారక ఘటన పశ్చిమబెంగాల్లో జరిగింది. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగింది. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని దంగిపారా గ్రామానికి చెందిన అసిమ్ దేవశర్మకు ఐదు నెలల వయసున్న కవల పిల్లలున్నారు. మే 7న వారు అస్వస్థతకు గురవడంతో కలియాగంజ్‌లోని దవాఖానకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సిలిగురిలోని మెడికల్ కళాశాల దవాఖానకు తీసుకెళ్లారు. వారిలో ఒకరి పరిస్థితి మెరుగుపడటంతో అతని భార్య పిల్లాడ్ని ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతున్న మరో చిన్నారి శనివారం రాత్రి మృతిచెందాడు.
మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు రూ.8,000 డిమాండ్ చేశారు. అప్పటికే తన దగ్గరున్న రూ.16 వేలు ఖర్చయిపోవడంతో దిక్కుతోచక ఆ తండ్రి బస్సును ఆశ్రయించాడు. చనిపోయిన చిన్నారిని ఓ బ్యాగులో వేసుకొని సిలిగురి నుంచి కలియాగంజ్ వరకు 200 కి.మీ బస్సులో ప్రయాణించాడు. అక్కడ కొందరి సాయంతో అంబులెన్స్ ఏర్పాటు చేసుకొని స్వగ్రామానికి చేరుకున్నాడు. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఈ వీడియోను ట్వీట్ చేయడంతో వైరల్‌గా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న స్వస్థ్య సాథి పథకంపై ఆయన విమర్శలు గుప్పించారు. చిన్నారి మృతిపై బీజేపీ నీచ రాజకీయం చేస్తున్నదని టీఎంసీ ఎంపీ శంతను సేన్ విమర్శించారు.