భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో (Indore) దారుణం చోటుచేసుకుది. స్నేహితురాళ్లతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై (Trainee Army Officers) దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వారిని నిలువునా దోచేశారు. అంతటితో ఆగకుండా వారి స్నేహితురాలిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఇండోర్‌లోని మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణలో ఉన్న ఇద్దరు ఆర్మీ అధికారులు తమ స్నేహితురాళ్లతో కలిసి చొట్టి జామ్ వద్ద ఉన్న ఫైరింగ్ రేంజ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారిని కొంతమంది వ్యక్తులు వారిని చుట్టుముట్టారు. తుపాకులు, కత్తులు, కర్రలతో బెదిరించారు. వారి వద్ద ఉన్న డబ్బు, నగలను తీసుకున్నారు. ఆ తర్వాత మహిళల్లో ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ దాడి నుంచి తప్పించుకున్న ఓ ట్రైనీ ఆఫీసర్ తన యూనిట్‌కు చేరుకుని కమాండింగ్ ఆఫీసర్‌కు జరిగిన విషయం చెప్పారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మీ అధికారులతో కలిసి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితులను దవాఖానకు తరలించారు. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. వారిలో ఒకరికి క్రిమినల్ రికార్డు ఉన్నట్లు గుర్తించారు.