Road Accident | రాజస్థాన్ బూందీ జిల్లాలోని 52వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలవగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కంకర లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పి కారుపై బోల్తాపడింది. దాంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూందీ జిల్లా సదర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సిలోర్ వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. టోంక్ జిల్లాకు చెందిన ఐదుగురు బర్త్‌డే వేడుకల్లో పాల్గొనేందుకు కారులో కోటాకు బయలుదేరారు. జైపూర్ నుంచి కోటాకు వెళ్తున్న కంకర లోడుతో ఉన్న ట్రక్కు వెనుక నుంచి వచ్చి కారును ఢీకొట్టింది.
ట్రక్కు టైర్ పేలడంతో నియంత్రణ కోల్పోయి రాంగ్ రూట్‌కి వెళ్లి.. టక్కు కారుపై బోల్తాపడింది. ట్రక్కు కింద కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ముగ్గురు సోదరులతో సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రేన్‌తో సహాయంతో కారును బయటకు తీసి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ట్రక్కు కింద కారు పూర్తిగా నలిగిపోయిందని, దానిని బయటకు తీయడానికి క్రేన్‌ను ఉపయోగించామన్నారు. చాలా గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ప్రమాదం తర్వాత జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని.. ఆ తర్వాత పునరుద్ధరించినట్లు వివరించారు. ట్రక్కు టైర్ పగలడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై వివరణాత్మక దర్యాప్తు జరుగుతోంది, ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు వివరించారు.