బెంగళూరు, ఫిబ్రవరి 13: కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిపే ఉదంతమిది! తాజాగా ఓ మహిళా ఉద్యోగి బెంగళూరు రోడ్లపై కారును నడుపుతూ..తన ల్యాప్‌ట్యాప్‌లో పనిచేసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ విభాగం, ఆమెకు పెనాల్టీ విధించింది. ఫిబ్రవరి 12న చోటుచేసుకున్న ఈ ఘటనపై ట్రాఫిక్ డీసీపీ (నార్త్) స్పందిస్తూ, ‘కారు నడుపుతూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొద్దు’ అంటూ ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆ మహిళా ఉద్యోగికి ఫైన్ విధించిన సంగతిని తెలియజేస్తూ ఓ ఫొటోను ‘ఎక్స్’లో విడుదల చేశారు.
వీడియో, ట్రాఫిక్ పోలీసుల ఫొటోలపై నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందించారు. ఆమె లైసెన్స్ రద్దు చేయాలని కొందరు అభిప్రాయపడగా, తప్పు ఆమెది కాదు.. ఆమెపై అధిక పని భారాన్ని మోపిన యజమానిదే తప్పు అంటూ మరికొందరు వాదించారు. మరొక నెటిజన్.. బెంగళూరు రోడ్లు, ట్రాఫిక్ వల్లే ఇదంతా అని ఆరోపించాడు. ‘మొన్న..వన్‌వేలో 17 కిలోమీటర్లు ప్రయాణించడానికి 2 గంటలు పట్టింది.
మొత్తంగా రోడ్లపైన్నే 4 గంటలు పోతున్నది. మరోవైపు ప్రజా రవాణా కిక్కిరిసిపోయింది. తిండి, నిద్ర ఎప్పుడు! ఆమె కారు నడుపుతూ తప్పనిసరై ల్యాప్‌ట్యాప్‌లో పనిచేసింది’ అని అన్నారు. ఆమె పని చేస్తున్న కంపెనీ సీఈవో, మేనేజర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మరొక నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు ఆమె టీమ్ కాల్ అటెండ్ అవుతున్నది..అందులో తప్పేముంది..అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.