అయోధ్య/న్యూఢిల్లీ, జనవరి 16: బాలరాముడి(రామ్‌లల్లా) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అయోధ్య సిద్ధమైంది. ఈ నెల 22న జరుగనున్న ప్రతిష్ఠాపన, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ కాంప్లెక్స్ వద్ద మంగళవారం నుంచి సంప్రదాయ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు.
ఇవి 21వ తేదీ వరకు జరుగుతాయని, 22న మధ్యాహ్నం 12.20 గంటలకు బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ప్రారంభమవుతుందని ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వివిధ రాష్ర్టాలకు చెందిన కళాకారులతో సంగీత ప్రదర్శన ఉంటుందని చంపత్ రాయ్ పేర్కొన్నారు. ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో రామ భక్తులు తమ భావోద్వేగాలు పంచుకొంటూ షార్ట్ వీడియో చేసి #ShriRamHomecoming ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టు చేయాలని ట్రస్టు విజ్ఞప్తి చేసింది.
భక్తుల కోసం ‘దివ్య్ అయోధ్య’ యాప్
భక్తుల కోసం యూపీ ప్రభుత్వం ‘దివ్య్ అయోధ్య’ యాప్ విడుదల చేసింది. యాప్‌లో నగరంలోని వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల సమాచారం ఉంటుంది. హోటళ్లు, టూరిస్టు గైడ్లు వంటి వాటిని ముందస్తుగా ఈ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
స్కామ్‌లకు తెరలేపిన మోసగాళ్లు
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం పేరుతో సైబర్ నేరగాళ్లు పలు స్కామ్‌లకు తెరలేపారు. ఆన్లైన్లో ప్రసా దం, ఆలయానికి విరాళాలు, ఆలయ ప్రవేశానికి వీఐపీ పాస్ అంటూ భక్తులకు వివిధ మా ధ్యమాల ద్వారా సందేశాలు, లింకులు పం పుతూ దోపిడీ కుట్రలకు పాల్పడుతున్నారు.
రాజకీయ కార్యక్రమం: రాహుల్
ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకూడదన్న కాంగ్రెస్ నిర్ణయంపై ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ సమర్థించారు. ఎన్నికల నేపథ్యంలో దీన్ని బీజేపీ, ఆరెస్సెస్‌లు ఒక రాజకీయ కార్యక్రమంలా మార్చాయని విమర్శించారు. మరోవైపు 22న కోల్‌కతాలో ‘సామరస్యం కోసం ర్యాలీ’ కార్యక్రమాన్ని నిర్వహించనునున్నట్టు పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమత ప్రకటించారు. ప్రాణప్రతిష్ఠ రాజకీయ నేతల పని కాదని, అది పూజారులు నిర్వహించే కార్యక్రమం అని అన్నారు.
అయోధ్య రైలు సర్వీసుల రద్దు
అయోధ్యకు రాకపోకలు సాగించే 36 రైలు సర్వీసులను రద్దు చేయడం లేదా మార్గం మార్చడం జరిగిందని అధికారులు వెల్లడించారు. లక్నో-బారాబంకి-అయోధ్య-షాగంజ్-జఫ్రాబాద్ సెక్షన్ పరిధిలో రైల్వే ట్రాక్ డబ్లింగ్, ఇతర పనుల నేపథ్యంలో ఈనెల 22 వరకు 36 రైలు సర్వీసులపై ప్రభావం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
7 రోజుల పూజల షెడ్యూల్
ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తుంది..
కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన బాల రాముడి విగ్రహాన్ని అయోధ్య ఆలయంలో ప్రాణప్రతిష్ఠకు ఎంపిక చేసినట్టు చేసినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ సోమవారం ప్రకటించారు. కృష్ణ శిల(నల్ల రాయి)పై మలచిన ఈ విగ్రహం 150-200 కిలోల బరువు ఉంటుందని తెలిపారు. బాలరాముడి విగ్రహ రూపురేఖల్ని చంపత్ రాయ్ గతంలో వర్ణిస్తూ.. రాముడి కండ్లు తామర పువ్వు రేకుల మాదిరిగా ఉంటుందని, ఆయన ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తుందని పేర్కొన్నారు. పొడవాటి చేతులతో విగ్రహం తయారైందని తెలిపారు.
కంటికి గాయమైనా..: యోగిరాజ్ కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. రామ్‌లల్లా విగ్రహాన్ని మలచేందుకు యోగిరాయ్ ఎంతో కష్టపడ్డాడని, గట్టిగా ఉండే శిలను చెక్కే సమయంలో కంటికి గాయమైందని, అయినా నొప్పిని భరిస్తూనే నిష్ఠగా పనిచేశాడని తెలిపారు. అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠాపనకు పరిపూర్ణమైన విగ్రహాన్ని అందించేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడని యోగిరాజ్ భార్య విజేత తెలిపారు.