F 35B Fighter Jet | ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల (Fighter jets)లో ఒకటైన బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్-35 బీ (F-35B ) ఇంకా కేరళ (Kerala)లోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు (Thiruvananthapuram airport)లోనే ఉంది. సాంకేతిక సమస్య కారణంగా ల్యాండ్ అయిన ఈ జెట్ 13 రోజులు గడుస్తున్నా ఇంకా గాల్లోకి ఎగరలేదు.
జెట్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో చేసేదేమీ లేక ప్రత్యేక టెక్నీషియన్లు, ఇంజినీర్లతో కూడిన 40 మంది సభ్యుల బృందాన్ని యూకే నేవీ రంగంలోకి దింపుతోంది. ఈ బృందం త్వరలోనే కేరళకు రానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ఆరుబయట ఉన్న ఈ యుద్ధ విమానాన్ని హ్యాంగర్‌కు తరలించేందుకు ప్రత్యేక ట్రాలీని కూడా యూకే నుంచి తెప్పించారు. ఈ జెట్‌ను రిపేర్ల కోసం ఉద్దేశించిన ప్రత్యేక ఎయిర్ ఇండియా హ్యాంగర్‌లోకి తరలించే అవకాశం ఉంది.
బ్రిటన్ దేశానికి చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ ఇటీవల ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత నేవీతో కలిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేసింది. బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఆ నౌకలోని యుద్ధ విమానం ఎఫ్-35 ఇంధనం తగ్గడంతో జూన్ 14న తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని ముందుగా వార్తలు వినిపించాయి. అయితే, ఇన్ని రోజులు అది ఇక్కడే ఉండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలిసింది.
ఆ ఫైటర్ జెట్‌లో సమస్యను సరిచేసిన తర్వాత తిరిగి హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పైకి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫైటర్జెట్కు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తున్నది. మన దేశంలో ఓ విదేశీ యుద్ధ విమానం ఐదు రోజులపాటు నిలిచిపోవడం, అందులోనూ ఎఫ్-35 లాంటి 5వ తరం స్టెల్త్జెట్ మోరాయించడం సాధారణ విషయం కాదు.
ఈ విమానం షార్ట్ టేకాఫ్‌తోపాటు వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది. అమెరికా సహా అతికొద్ది దేశాల ఎయిర్‌ఫోర్సుల వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది. అంతటి శక్తివంతమైన ఈ జెట్ ఇన్ని రోజుల పాటూ నిలిచిపోవడంతో నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి. ఈ యుద్ధ విమానం OLXలో సేల్కు ఉంది అంటూ నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ ఫైటర్ జెట్ అమ్మకానికి వచ్చింది.. ఎవరైనా కొంటారా..? అంటూ నెటిజన్లు నెట్టింట తెగ పోస్టులు పెడుతున్నారు. 110 మిలియన్ డాలర్ల జెట్‌ను కేవలం 40 మిలియన్ డాలర్లకే పొందొచ్చంటూ జోకులు వేస్తున్నారు.
Also Read..
CM Convoy | కల్తీ డీజిల్.. సీఎం కాన్వాయ్‌లోని 19 వాహనాలు ఒకేసారి బ్రేక్‌డౌన్..!
Kolkata | కోల్‌కతాలో మరో దారుణ ఘటన.. న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
building collapses | భారీ వర్షాలకు కుప్పకూలిన భవనం.. ముగ్గురు వలస కార్మికులు మృతి