Tourists @ Simla | కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వేలాది మంది పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్‌కు చేరుకున్నారు. పర్యాటకులతో రాజధాని నగరం సిమ్లాతో పాటు మనాలీలో నూతన సంవత్సర వేడుక సందడి నెలకొన్నది. నగరాలు జనంతో కిటకిటలాడాయి. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఉదయం నుంచే సిమ్లా, మనాలీ రావడం మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా ట్రాఫిక్ నిలిచిపోయి కనిపించింది.
నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు 40 వేల మందికి పైగా పర్యాటకులు సిమ్లా చేరుకున్నారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో రాజధాని పూర్తిగా సందడిగా మారింది. షోఘి నుంచి 5800 వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించాయి. చండీగఢ్ నుంచి సిమ్లా చేరుకునేందుకు గంటన్నర సమయం పడుతుండగా, షోఘి నుంచి సిమ్లాకు 2 – 3 గంటల సమయం పడుతున్నది. రోడ్లపై వాహనాలు నడపడం చాలా కష్టంగా ఉన్నది. గత 2 రోజులుగా 11,600 వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు చెప్తున్నారు. అక్కడి పార్కింగ్ ప్రాంతాలన్నీ పూర్తిగా నిండిపోవడంతో పర్యాటకులు తమ వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. సిమ్లా రోడ్లన్నీ నిండిపోవడంతో కొత్త వాహనాలను పోలీసులు నగరంలోకి అనుమతించడం లేదు.
నగరంలోని ప్రధాన విక్టరీ టన్నెల్‌పై కూడా ప్రజలు ట్రాఫిక్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ను నియంత్రణకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ వాహనాలు అధికంగా రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. సంజౌలి, ధాలీ, కుఫ్రీకి వెళ్లే మార్గంలో కూడా రైళ్లు నెమ్మదిగా కదులుతున్నాయి. చాలా చోట్ల జామ్ కావడంతో పర్యాటకులు వాహనాల నుంచి దిగి రోడ్డుపై సరదాగా డ్యాన్సులు చేస్తూ గడుపుతున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసులను భారీ ఎత్తున మోహరించారు. మనాలిలో కూడా పర్యాటకులు పోటెత్తారు. నూతన సంవత్సర వేడుకల కోసం పర్యాటకులు పెద్ద సంఖ్యలో మనాలికి చేరుకున్నారు. 24 గంటల్లో ఇప్పటివరకు 4600 వాహనాలు మనాలిలోకి ప్రవేశించాయి. దీంతో నగర రహదారులు పూర్తిగా కిక్కిరిసిపోయాయి.