Maoist Chalapati | న్యూఢిల్లీ, జనవరి 22: దశాబ్దాల పాటు భద్రతా దళాలకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న మావోయిస్టు అగ్రనేత జయరాం రెడ్డి అలియాస్ చలపతి ప్రాణం పోవడానికి తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో తీసుకున్న సెల్ఫీ కారణమని తెలుస్తున్నది. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో చనిపోయిన 16 మంది మావోయిస్టులలో చలపతి ఒకరు. ఆయనపై కోటి రూపాయల రివార్డు ఉంది.
ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో 2008 ఫిబ్రవరిలో 13 మంది భద్రతా సిబ్బందిని బలిగొన్న దాడికి చలపతే ప్రధాన సూత్రధారి. పోలీసుల ఆయుధాగారాన్ని దోచుకుని నయాగఢ్ నుంచి మావోయిస్టులు తప్పించుకు పారిపోవడం వెనుక చలపతి హస్తం ఉంది. ఆయుధాగారంపై దాడి జరిగిన సమయంలో పోలీసు బలగాలు నయాగఢ్లోకి ప్రవేశించకుండా భారీ చెట్టు కొమ్మలను రోడ్డుకు అడ్డంగా పడేసి నయాగఢ్లోకి వెళ్లే మార్గాలన్నిటినీ అడ్డుకోవడం చలపతి వ్యూహమేనని ఒక అధికారి చెప్పారు. అనేక దశాబ్దాలు అజ్ఞాత జీవితాన్ని గడిపిన చలపతిని గుర్తించడంలో అతని భార్య, ఆంధ్రా ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ డిప్యుటీ నాయకురాలు అరుణతో తీసుకున్న సెల్ఫీ సాయపడిందని ఆ అధికారి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ తర్వాత 2016 మేలో అక్కడ దొరికిన ఓ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెల్ఫీ లభించిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత చలపతిపై రూ.కోటి రివార్డును ప్రభుత్వం ప్రకటించిందని, దీంతో అతను 8-10 మంది అంగ రక్షకులతో కూడిన భద్రతా దళాన్ని ఏర్పాటు చేసుకుని తిరగడం మొదలైందని ఆ అధికారి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు వాస్తవ్యుడైన చలపతి కేంద్ర కమిటీలో సీనియర్ సభ్యుడు.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో క్రియాశీలకంగా వ్యవహరించిన చలపతి ఆ ప్రాంతంలో తరచు ఎన్కౌంటర్లు జరుగుతుండడంతో సురక్షితంగా ఉండేందుకు ఒడిశా సరిహద్దు సమీపంలోకి మకాం మార్చాడు. సైనిక ఎత్తుగడలు, గెరిల్లా పోరాటంలో చలపతిని నిఫుణుడిగా భావిస్తారని అధికారులు చెప్పారు. 2026 నాటికి దేశం నుంచి మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసిన అమిత్ షా నిన్నటి ఎన్‌కౌంటర్‌ను మావోయిస్టులకు మరో చావుదెబ్బగా అభివర్ణించారు.ఎన్కౌంటర్లో మరో ఇద్దరి నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకోవడంతో మృతుల సంఖ్య 16కు చేరింది.