Army officer | పాకిస్థాన్ (Pakistan) మొత్తంపై దాడి చేయగల సైనిక సామర్థ్యం భారత్‌కు ఉందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్యా (Lieutenant General Sumer Ivan D’Cunha) తెలిపారు. అదే జరిగితే దాక్కోవడానికి పాక్ ఏదైనా లోతైన గోయిని వెతుక్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాక్ పాల్పడిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు చెప్పారు. వారు మనపై ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను కూల్చేయడంతోపాటు వారి కీలక సైనిక స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసినట్లు తెలిపారు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ మొత్తం భారత్ రేంజ్‌లోనే ఉందని తెలిపారు. దాయాదిపై పూర్తి స్థాయిలో దాడి చేసేందుకు భారత్ వద్ద సరిపడా ఆయుధ సామర్థ్యం ఉందని తెలిపారు. మన సరిహద్దుల నుంచే ఆ దేశంలోని అన్ని ప్రాంతాలపై దాడి చేయగలం అని చెప్పారు. తమ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ను రావల్పిండి (Rawalpindi) నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా మరే ఇతర ప్రాంతాలకు తరలించినా.. అక్కడ కూడా దాడులు చేయగలం అని హెచ్చరించారు. అదే జరిగితే వారు దాక్కోడానికి ఏదైనా లోతైన గోయిని వెతుక్కోవాలని ఎద్దేవా చేశారు.
ఇక ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో దేశీయ పరిజ్ఞానంతో తయారైన డ్రోన్లు, గైడెడ్ మ్యూనిషన్లు కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజలను కాపాడటమే సాయుధ బలగాల ప్రాథమిక కర్తవ్యమని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. దానికి అనుగుణంగానే ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు.
Also Read..
PAK Spy Network | యూట్యూబర్.. గార్డ్.. స్టూడెంట్.. బట్టబయలవుతున్న పాకిస్థాన్ స్పై నెట్వర్క్!
Supreme Court | మిమ్మల్ని చూసి దేశం సిగ్గుపడుతున్నది.. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రిపై సుప్రీం ఆగ్రహం
అమెరికా మధ్యవర్తిత్వం లేదు : విక్రం మిస్రీ