Supreme Court | ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1200 మంది ఓటర్లను 1500కు పెంచుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది. ప్రకాశ్ సింగ్ పిటిషన్ దాఖలు చేయగా.. సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారించనున్నారు. ప్రతి నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల సంఖ్యను పెంచుతూ ఈ ఏడాది ఆగస్టులో ఎన్నికల సంఘం దాకలు చేసిన ఉత్తర్వులను ప్రకాశ్ సింగ్ సవాల్ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యను పెంచాలనే నిర్ణయం ఏకపక్షమని.. డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. అక్టోబర్ 24న ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై కమిషన్ వైఖరిని వెల్లడించేందుకు వీలుగా పిటిషన్ కాపీని పంపాలని ఎన్నికల సంఘం న్యాయవాదికి పిటిషనర్‌ను ఆదేశించింది.
పోలింగ్ స్టేషన్లలో 1200 నుంచి 1500కు ఓటర్ల సంఖ్యను పెంచడం వల్ల ఓటు వేయడానికి ఎక్కువ సమయం పడుతుందని పిటిషనర్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ క్యూ ఉండడంతో ఓటర్లు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ ఎక్కువ మంది ఓటు వేసేలా చూడడం లక్ష్యమని, ఈవీఎం వినియోగం వల్ల ఓటింగ్ ప్రక్రియ గతంలో కంటే తక్కువ సమయం పడుతుందన్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఓటింగ్ ప్రక్రియ సమయాన్ని తగ్గించేందుకు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంల సంఖ్యను పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని ధర్మాసనం పేర్కొంది.
ఈ నిర్ణయం మహారాష్ట్ర, జార్ఖండ్‌ల అసెంబ్లీ ఎన్నికలపై (పూర్తయిన ఎన్నికలు), వచ్చే ఏడాది జరగనున్న బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. సాధారణంగా ఎన్నికలు 11 గంటల పాటు జరుగుతాయని, ఓటు వేయడానికి 60 నుంచి 90 సెకన్ల సమయం పడుతుందని.. దాంతో ఒక పోలింగ్ కేంద్రంలో రోజుకు 490 నుంచి 660 మంది ఈవీఎంల ద్వారా ఓటు వేయవచ్చని పేర్కొన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 80-90 శాతం వరకు ఓటింగ్ నమోదవుతుందని, దీంతో క్యూలో ఉండి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ క్రమంలో సుమారు 20 శాతం మంది ఓటర్లు పోలింగ్ సమయం ముగిసిన కూడా క్యూలో నిలబడతారని.. నిరీక్షించలేక ఓటు వేసేందుకు ఆసక్తిచూపరని.. ప్రగతిశీల ప్రజాస్వామ్యానికి ఆమోదయోగ్యం కాదని పిటిషన్లో పేర్కొన్నారు.