Tomato Price | బెంగళూరు/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టమాటా ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో కొండెక్కి కూర్చొన్నాయి. టమాటా ధరలు గత నెలలో 326.13 శాతం పెరిగినట్టు ప్రభుత్వ అంచనా. కిలో టమాట ధరల పెరుగుదలతో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల యూపీలో ఓ కూరగాయల వ్యాపారి దుకాణం వద్ద బౌన్సర్లను నియమించుకొన్నారు. తాజాగా టమాటాల అమ్మకంతో కర్ణాటకలోని ఓ రైతు కుటుంబానికి రూ.38 లక్షలు వచ్చాయి. కోలార్ జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం మంగళవారం 2 వేల బాక్స్‌ల టామాటాను మార్కెట్లో అమ్మగా.. బాక్స్‌కు రూ.1,900 చొప్పున రూ.38 లక్షలు వచ్చాయట.
ప్రభాకర్ గుప్తా, అతని సోదరుడికి కోలార్ జిల్లాలోని బేథమంగళలో 40 ఎకరాల పొలం ఉన్నది. మంగళవారం 15 కేజీల బాక్స్ రికార్డు స్థాయిలో రూ.1,900 పలికింది. చింతామణి తాలూకాలోని వైజకూర్ గ్రామానికి చెందిన వెంకటరమణా రెడ్డి 15 కేజీల బాక్స్‌ను రూ.2,200కు అమ్మారు. 54 బాక్స్‌లను కోలార్ వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చానని ఆయన తెలిపారు.
కేంద్రం బుధవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రధాన వినియోగ కేంద్రాల్లో పంపిణీ చేసేందుకుగానూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాటాలను సేకరించాలని కేంద్ర సహకార సంస్థలైన నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్(నాఫెడ్), నేషనల్ కోపరేటివ్ కంజ్యూమర్స్ ఫెడరేషన్(ఎన్సీసీఎఫ్)లను ఆదేశించింది. ఈనెల 14 నుంచి ఢిల్లీతో పాటు బీహార్, యూపీ, పశ్చిమబెంగాల్లోని పలు నగరాల్లో రాయితీ ధరకు టమాటాలను పంపిణీ చేస్తామని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.కాగా, బుధవారం పంజాబ్‌లోని బఠిండాలో కిలో టమాటా అత్యధికంగా రూ.203, కర్ణాటకలోని బీదర్‌లో రూ.34గా ఉన్నది.