భారత్ ఎల్లప్పటికీ శాంతినే కోరుకుంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. యూపీ ఎన్నికల సందర్భంగా బైరియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావించారు. గతంలో భారత్ మాటలు ఎవ్వరూ వినేవారు కాదని, ఇప్పుడు మాత్రం చెవులు రిక్కించి ప్రపంచం మొత్తం వింటోందని ఆయన పేర్కొన్నారు.
‘రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నది చూస్తున్నాం. భారత్ మాత్రం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. అందులో అనుమానం లేదు. ఈ సమయంలో మోదీ పాత్ర చెప్పకుండా ఉండలేం. భారత్ ఎప్పుడూ ఇతర దేశంపై దాడులు చేయలేదు. ప్రతీ దేశమూ భారత్ మార్గంలోనే నడవాల్సి ఉంటుంది. విశ్వశాంతికి ఇదే సిద్ధాంతం అవసరం’ అంటూ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.