ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ (Ajit Pawar) తన వర్గం నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం ఈ భేటీ జరిగింది. ఎన్సీపీ ప్రముఖులైన పార్టీ రాష్ట్ర చీఫ్ సునీల్ తట్కరే, ఛగన్ భుజబల్, దిలీప్ వల్సే పాటిల్, హసన్ ముస్రిఫ్, అదితి తట్కరే తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, పార్టీ భవిష్యత్తు గురించి వారు చర్చించారు.
కాగా, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన ‘మహాయుతి’ కూటమి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పరాజయం పాలైంది. రాష్ట్రంలోని 48 స్థానాలకు గాను కేవలం 17 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. 2019లో 23 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి కేవలం 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 7 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఒక్క సీటు గెలుచుకున్నాయి.
మరోవైపు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి లోక్‌సభ ఎన్నికల్లో 30 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 13 సీట్లు, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 9 సీట్లు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎనిమిది సీట్లు గెలుచుకున్నాయి.
కాగా, శరద్ పవార్ నాయకత్వంపై ఎన్సీపీలో నమ్మకం ఉన్నట్లు లోక్‌సభ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ వర్గానికి చెందిన 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే ఉద్ధవ్ ఠాక్రేకు కూడా శివసేనపై పట్టు ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి మలుపులు తిరుగవచ్చని అంతా భావిస్తున్నారు.
#WATCH | Mumbai | NCP chief Ajit Pawar holds meeting with party leaders following Lok Sabha election results pic.twitter.com/ZpU6FN5bYF
— ANI (@ANI) June 6, 2024