న్యూఢిల్లీ, జూలై 25: ఇటీవల విపక్ష రాష్ట్రాల అప్పుల జాబితాను భూతద్దంలో చూపి హంగామా చేసిన కేంద్రం తన అప్పును ఒప్పుకొంది. తన అప్పు కుప్పతెప్పలుగా పెరిగిన మాట వాస్తవమేనని తలవూపింది. 2021 డిసెంబర్ – 2022 మార్చి మధ్యకాలంలో భారత ప్రభుత్వం అప్పు 128.41 లక్షల కోట్ల నుంచి 133.22 లక్షల కోట్లకు పెరిగింది.
అంటే 3.74 శాతం పెరుగుదల అన్నమాట. లోక్‌సభలో సోమవారం సభ్యులు తిరునావుక్కరసు, రవ్‌నీత్‌సింగ్ బిట్టూ, డాక్టర్ కళానిధి వీరాస్వామి ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి తరఫున సమాధానమిస్తూ సహాయమంత్రి పంకజ్ చౌదరి ఈ సంగతి వెల్లడించారు. రాష్ర్టాల పరిధిలోకి వచ్చే జాతీయ సామాజిక భద్రతా నిధి వంటి పథకాల చెల్లింపులను ఇందులో మినహాయించారు. ప్రస్తుత మారక రేటు ప్రకారం అప్పును నిర్ధారించినట్టు మంత్రి తెలిపారు.
కొవిడ్ విశ్వ మహమ్మారి కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రుణం జీడీపీలో 9 శాతానికి పైగా పెరిగిందని ఆర్థిక శాఖ సహాయమంత్రి చెప్పారు. 2019-20లో జీడీపీలో ద్రవ్యలోటు జీడీపీలో 4.1% ఉండగా.. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అది జీడీపీలో 9.2 శాతం వద్ద నిలిచిందని తెలిపారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటును 4.5% దిగువన స్థిరీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. పన్నుల ఆదాయం పెంచుకోవడం, ఆస్తుల అమ్మకం, ప్రభుత్వ వ్యయాన్ని పకడ్బందీగా నిర్వహించడం వంటి చర్యల ద్వారా దీనిని సాధించాలని భావిస్తున్నట్టు మంత్రి లోక్‌సభకు చెప్పారు.రు.