లక్నో: అనారోగ్యంతో హాస్పిటల్‌లోని ఐసీయూలో ఉన్న తండ్రి కోరికను ఇద్దరు కుమార్తెలు నెరవేర్చారు. వైద్యులు, సిబ్బంది సమక్షంలో ఆయన కళ్లెదుట వివాహం చేసుకున్నారు. (Daughters Married At Hospital) ఈ అసాధారణమైన పెళ్లికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. మోహన్‌లాల్‌గంజ్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల జునైద్ మియాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. చావుబతుకుల మధ్య ఉన్న ఆయనకు లక్నో హాస్పిటల్‌లోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
కాగా, జునైద్ మియాన్ ఇద్దరు కుమార్తెలకు పెళ్లి సంబంధాలు కుదిరాయి. మరికొన్ని రోజుల్లో వారికి వివాహం జరుగాల్సి ఉంది. అయితే తండ్రి జునైద్ ఆసుపత్రిపాలు కావడంతో కుమార్తెలు ఆందోళన చెందారు. వారి పెళ్లి చూడాలన్న తండ్రి కోరికను నెరవేర్చారు. ఆయన కళ్ల ముందే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. దీంతో ముంబైకి చెందిన వరులు లక్నో చేరుకున్నారు.
మరోవైపు శనివారం జునైద్ కుమార్తెలు, వరులు, నిఖా జరిపే మత పెద్ద, ఒకరిద్దరు బంధువులు మెడికల్ దుస్తులు ధరించారు. ఐసీయూలోని మిగతా రోగులకు ఇబ్బంది కలుగకుండా, వైద్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా ఐదు నిమిషాల్లో పెళ్లి తంతు పూర్తి చేశారు. అసాధారణ రీతిలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A hospital in UP’s Lucknow organised an ICU Wedding to fulfill ailing father’s wish to see his daughters getting married. pic.twitter.com/qSUf9SAnfH
— Piyush Rai (@Benarasiyaa) June 15, 2024