Chiru- Venki | టాలీవుడ్లో దశాబ్దాలుగా స్టార్‌డమ్‌ను నిలబెట్టుకున్న సీనియర్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అభిమానులు ఎప్పటి నుంచో వీరిద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూడాలని కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఆ కలను నిజం చేస్తూ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రంలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలోకి రానుంది. విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసిన చిత్ర బృందం, తాజాగా చిరంజీవి – వెంకటేష్ కాంబినేషన్లో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూ ఈ రోజే జరగనుందని సమాచారం.
ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి లేదా యంగ్ హీరో తేజ సజ్జ హోస్ట్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయని టాక్. ఇండస్ట్రీలో అరుదుగా కనిపించే ఈ సీనియర్ స్టార్ జోడీ ఒకే వేదికపై మాట్లాడటం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపుతోంది. ఈ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు, చిరంజీవి – వెంకటేష్ మధ్య ఉన్న స్నేహం, కెరీర్ మైలురాళ్లు, సరదా సంఘటనలు చర్చకు వచ్చే అవకాశముందని అంచనా. వీరిద్దరి మాటలు, అనుభవాలు వినేందుకు అభిమానులు గంటల లెక్కన ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే, ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. లేడీ సౌత్ సూపర్ స్టార్ నయనతార మరోసారి చిరంజీవితో జతకట్టడం ఈ సినిమాకు మరింత ఆకర్షణగా మారింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన తెచ్చుకున్నాయి. కేథరిన్ థ్రేసా, సచిన్ ఖేడ్కర్, శరత్ సక్సేన, హర్షవర్ధన్, అభినవ గోమఠం, రఘు బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వెంకటేష్ విషయానికి వస్తే, గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ఆయన భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. అదే దర్శకుడు అనిల్ రావిపూడితో మళ్లీ ఈసారి హీరోగా కాకుండా కీలక పాత్రలో రావడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సంక్రాంతికి మరోసారి వెంకటేష్ లక్ కలిసి వస్తుందా? అలాగే చిరంజీవికి ఈ సినిమా మరో విజయాన్ని అందిస్తుందా? అన్నది రిలీజ్ తర్వాత తేలనుంది.