TN CM Vijay : అప్పుడు అంటే 2013లో నాటి జయలలిత (Jayalalita) సర్కారు నటుడు విజయ్ (Actor Vijay) ని అవమానించింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విజయ్ తమిళనాడు (Tamil Nadu) లో తనే స్వయంగా సర్కారును ఏర్పాటు చేశారు. కేవలం 13 ఏళ్లలో జరిగిన ఈ మార్పు విజయ్ అభిమానుల్లో అంతులేని సంతోషాన్ని నింపింది. 2013లో చెన్నైలో సినిమా శతాబ్ది ఉత్సవాలు (Cinema Centenary Celebrations) జరిగాయి. ఈ ఉత్సవాలకు నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (Pranag Mukherjee), తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (Jayalalita) హాజరయ్యారు. వారితోపాటు ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నటీనటులు కూడా ఉత్సవాలకు విచ్చేశారు.
తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌ని కూడా ఆ ఉత్సవాలకు ఆహ్వానించారు. అయితే నాటి జయలలిత సర్కారు విజయ్‌కి ఉద్దేశపూర్వకంగా వెనుక వరుసలో సీటు కేటాయించింది. ఆయనకు తక్కువ పేరున్న నటుడు చియాన్ విక్రమ్‌తోపాటు పలువురికి ముందు వరుసలో సీట్లు ఇచ్చారు. విజయ్ వెనుక వరుసలో కూర్చుని ఉండటాన్ని గమనించిన చియాన్ విక్రమ్.. ముందు వరుస నుంచి వెనక్కి వెళ్లి విజయ్ పక్కన కూర్చున్నారు. అప్పటివరకు విజయ్ అక్కడ ఒంటరిగానే కూర్చున్నారు. ఆ తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ కూడా చియాన్ విక్రమ్‌ను అనుసరించి విజయ్ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు.
అయితే ఈ అవమానంపై విజయ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎవరినీ తప్పుపట్టలేదు. కానీ విజయ్‌ని బహిరంగంగా అవమానించారని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు విమర్శలు చేశారు. నటుడిగా ప్రజల అభిమానం చూరగొని రాజకీయాల్లో ఎదిగిన ఎంజీఆర్‌ను తమిళనాడు అప్పటికే చూసింది. జయలలిత కూడా సినిమా పరిశ్రమలో పేరు సంపాదించే రాజకీయాల్లో ఎదిగారు. తమిళనాడులో సినీతారలను ఆరాధించే సంస్కృతి ఎక్కువనే విషయాన్ని రాజకీయాల్లో ఆ ఇద్దరి రాణింపు స్పష్టం చేస్తున్నది. అలాంటిచోట ప్రముఖ నటుడిని అవమానిస్తే ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళ్తుందో జయలలితకు తెలుసు. అయినా ఆమె సర్కారు విజయ్‌ని అవమానించింది.
స్వయంగా జయలలిత కూడా ఇలాంటి అవమానాన్ని ఎదుర్కొని ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. 1989లో తమిళనాడు అసెంబ్లీలో జయలలిత చీర లాగిన ఘటన దేశాన్ని కుదిపేసింది. జయలలిత కంటతడి పెడుతూ సభ నుంచి వెలుపలకు వస్తూ శపథం చేశారు. ఆ ఘటనను మహాభారతంలోని ద్రౌపదికి జరిగిన అవమాన ఘటనతో పోల్చారు. తాను ముఖ్యమంత్రిగానే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని సవాల్ చేశారు. ఆ తర్వాత 1991 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా సభలో అడుగుపెట్టారు. ఇప్పుడు విజయ్ కూడా ముందుగా అవమానానికి గురై, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు.