న్యూఢిల్లీ, డిసెంబర్ 3: కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బుధవారం పార్లమెంట్ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ కార్మిక కోడ్లను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో నిరసనకు దిగారు. పార్లమెంట్ మకర ద్వార్ ఎదుట జరిగిన నిరసనలో కాంగ్రెస్ ఎంపీలతో పాటు డీఎంకే, టీఎంసీ, వామపక్ష పార్టీలు, ఇతర పార్టీల ఎంపీలు ప్లకార్డులు, పోస్టర్లను చేతబట్టి నినాదాలు చేశారు. కాగా, పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలా తదితర ఉత్పత్తులపై అధిక ఎక్సైజ్ సుంకం విధించే చట్టాన్ని బుధవారం పార్లమెంట్ ఆమోదించింది. ఈ ఉత్పత్తులపై ఉన్న కాంపన్సేషన్ సెస్ గడువు ముగుస్తున్న క్రమంలో కేంద్రం సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025ను దిగువ సభలో ప్రవేశపెట్టి, మూజువాణి ద్వారా ఆమోదించారు.
దేశంలోని అన్ని రాజ్భవన్ల పేర్లను లోక్ భవన్లుగా మారుస్తూ నవంబర్ 25న హోం శాఖ ఆదేశాలు జారీ చేయడం పట్ల రాజ్యసభలో బుధవారం వాడీవేడిగా చర్చ జరిగింది. జీరో అవర్‌లో ఏఐటీసీ సభ్యురాలు డోలాసేన్ ఈ విషయాన్ని లేవనెత్తుతూ ఈ పేరు మార్పు గురించి అటు పార్లమెంట్, అసెంబ్లీలకు గానీ, మంత్రివర్గానికి కానీ తెలియదని అన్నారు. దీనిపై కనీసం చర్చ కూడా జరపలేదని అన్నారు. కాగా, దీనిపై చర్చ జరుగుతుండగానే ఆమె ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం, ఇతర అంశాల గురించి ప్రస్తావించగా, సభా నాయకుడు జేపీ నడ్డా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ఏకీభవించిన రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ నిర్దేశిత అంశం కాకుండాఏ ఇతర అంశాలూ రికార్డులకెక్కవని స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులను తక్షణమే విడుదల చేయాలని టీఎంసీ ఎంపీలు డిమాండ్ చేశారు. వీరు పార్లమెంటు ఆవరణలోని ప్రేరణ స్థల్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం సమీపంలో బుధవారం ధర్నా చేశారు. కేంద్రం తమ రాష్ర్టానికి రూ.2 లక్షల కోట్లు ఇవ్వవలసి ఉందని తెలిపారు. అనంతరం నినాదాలు చేస్తూ పార్లమెంట్ హౌస్‌కు వెళ్లారు.