కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై పట్టు కోసం సాగుతున్న పోరు ఆదివారం న్యాయపరమైన వేదికకు విస్తరించింది. పార్టీ పేరు, గుర్తు, సంస్థాగత హోదాలను రితబ్రత వర్గం చట్ట విరుద్ధంగా వాడుకొంటూ కార్యకర్తలను, మద్దతుదారులను తప్పు దోవ పట్టిస్తున్నదని మమత శిబిరం తరపున టీఎంసీ సంయుక్త జాతీయ కార్యదర్శి డోలా సేన్ కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రితబ్రత బెనర్జీ, మాజీ మంత్రి అరూప్ రాయ్, జావేద్ ఖాన్, సందీపన్ సాహా, బిప్లబ్ మిత్రాలు పార్టీ అధినాయకత్వం నుంచి అనుమతి లేకుండా తమను తాము టీఎంసీ ఆఫీస్ బేరర్లుగా పేర్కొంటూ సమాంతర సంస్థను నడిపేందుకు ప్రయత్నిస్తున్నారని మమత విధేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఎంసీ తిరుగుబాటు వర్గం ‘ప్రత్యేక సమావేశం’ నిర్వహించి కొత్త జాతీయ వర్కింగ్ కమిటీని ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకొంది.