కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌లో సంక్షోభం ముదురుతున్నది. అసలైన టీఎంసీ ఎవరిదన్న దానిపై పోరు తీవ్రమైంది. తమకే మెజారిటీ ఉన్నందున, అసలైన టీఎంసీ తమదేనని మమతా బెనర్జీపై తిరుగుబావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు చెబుతున్నారు. తమ గ్రూప్‌నే అసలైన టీఎంసీగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి విన్నవించనున్నారు. ఈ సందర్భంగా రెబల్ ఎంపీ జగదీశ్ చంద్ర బర్మా బసునియా మాట్లాడుతూ రెబల్ ఎంపీలు ఇప్పటికే స్పీకర్ బిర్లాకు వినతిపత్రం సమర్పించారని, దీనిపై సోమవారం అధికారిక ప్రకటన రావచ్చునని తెలిపారు. కాగా, టీఎంసీ ఎంపీ కకోలి ఘోష్ నేతృత్వంలో 19 మంది అసమ్మతి ఎంపీలు ఇప్పటికే ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. సభలో పార్టీ విప్‌గా దస్తీదార్ కొనసాగుతారని వారు స్పీకర్‌కు సమర్పించిన లేఖలో పేర్కొన్నారు.
‘మేం బిర్లాకు లేఖ సమర్పించాం. సోమవారం ఆయనను వ్యక్తిగతంగా కలిసి మాదే అసలైన టీఎంపీ పార్లమెంటరీ గ్రూప్ అని తెలిపి, మమ్మల్ని గుర్తించమని విజ్ఞప్తి చేస్తాం’ అని బసునియా పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే రెబల్ ఎంపీలతో ప్రత్యేక గ్రూప్‌గా ఏర్పడిన క్రమంలో తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తామని ఆయన ప్రకటించారు. శానసకర్తలను పక్షం మారేలా ప్రేరేపిస్తున్నారు అంటూ టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఆయనో అబద్ధాలకోరు అని బసునియా వ్యాఖ్యానించారు. తాము 19 మంది ఎంపీలం ఉన్నామని, ఒక ఎంపీగా కీర్తి ఆజాద్ అలాంటి విమర్శలు చేయడం తగదని అన్నారు.
తమ పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీలు 19 మంది లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖను సమర్పించారు. మే 18న సమర్పించిన లేఖపై సంతకం చేసిన వారిలో ఎంపీలు సాయోని ఘోష్, శతాబ్ది రాయ్, యూసుఫ్ పఠాన్, రచనా బెనర్జీ తదితరులు ఉన్నారు. కాగా, గురువారం మరో టీఎంసీ రాజ్యసభ ఎంపీ పార్టీకి రాజీనామా చేశారు. ప్రకాశ్ చిక్ బరైక్ రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, టీఎంసీలో సీనియర్ నేతలైన శత్రుఘ్న సిన్హా, బాబుల్ సుప్రియో, సౌగతా రాయ్‌లు మమత నాయకత్వంపై తమ విశ్వాసాన్ని ప్రకటించారు.
బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి వరుస కష్టాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఆమెపై ఒక ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఈ ఏడాది మొదట్లో కోల్‌కతాలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆమె చేసిన ప్రసంగంపై ఈ కేసు దాఖలైంది. మార్చి 9న ఒక ధర్నా వేదిక వద్ద ప్రజా శాంతికి భంగం కలిగించడమే కాక మతసామరస్యాన్ని దెబ్బతీసేలా మమత ప్రసంగించారంటూ తుషార్ కాంతిదాస్ చేసిన ఫిర్యాదుపై ఆమెపై కేసు దాఖలైంది.