కోల్‌కతా: పోలీస్ సమన్లకు వ్యతిరేకంగా హైకోర్టును టీఎంసీ ఎంపీ ఆశ్రయించారు. (TMC MP moves Calcutta HC) పోలీసుల నోటీసులు చట్టవిరుద్ధమని విమర్శించారు. తనను బెదిరించేందుకు పోలీసులు సమన్లు జారీ చేసినట్లు ఆయన ఆరోపించారు. ఆగస్ట్ 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల జూనియర్ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రే సొంత పార్టీ, ప్రభుత్వంపై గళమెత్తారు. సీబీఐ న్యాయంగా వ్యవహరించాలని అన్నారు. సూసైడ్ స్టోరీ చెప్పిన కాలేజీ మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ కమిషనర్‌ను కస్టడీలో తీసుకుని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. హాల్ గోడను ఎందుకు కూల్చివేశారు?, హత్యాచారం జరిగిన 3 రోజుల తర్వాత స్నిఫర్ డాగ్‌ను ఎందుకు ఉపయోగించారు? వంటి ప్రశ్నలు సంధించారు.
కాగా, స్నిఫర్ డాగ్ గురించి అవాస్తవాలు ప్రచారం చేసినందుకుగాను టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రేకు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కలకత్తా హైకోర్టును ఆశ్రయించినట్లు సోమవారం ఆయన తెలిపారు. తన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని మీడియాతో అన్నారు. మరోవైపు పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎంపీ సుఖేందు శేఖర్‌ను పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించారు.