TMC MP Mahua | తృణమూల్ కాంగ్రెస్ (TMP) ఎంపీ మహువా మోయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై చార్జిషీట్ దాఖలు చేసేందుకు సీబీఐకి అనుమతిస్తూ లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. నవంబర్ 21న జస్టిస్ అనిల్ ఖేతర్పాల్, హరీశ్ వైద్యనాథన్ శంకర్ నేతృత్వంలోని ధర్మాసనం మహువా మొయిత్రాకు మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరిస్తూ, నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. 2013 లోక్‌పాల్, లోకాయుక్త చట్టం కింద లోక్‌పాల్ అనుసరించిన ప్రక్రియ స్పష్టంగా లోపభూయిష్టంగా ఉందని మహువా మొయిత్రా తరఫు న్యాయవాదులు వాదించారు.
వ్యాపారవేత్త దర్శన్ హిరానందాని సూచనల మేరకు మహువా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారంటూ ఆరోపణలున్నాయి. ఆమెపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఫిర్యాదు చేశారు. ఈ సాక్ష్యాలను న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ అందించారని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్‌కు రాసిన లేఖలో దూబే మహువా మాజీ స్నేహితుడు, న్యాయవాది అయిన జై అనంత్ నుంచి తనకు ఓ లేఖ అందిందని.. అందులో ప్రశ్నలు అడగడం కోసం టీఎంసీ ఎంపీకి వ్యాపారవేత్త దర్శన్ హిరానందాని రూ.కోట్లాది రూపాయలతో పాటు విలువైన కానుకలు ఇచ్చినట్లుగా ఆరోపించారు. ఎంపీ మొయిత్రా పార్లమెంట్లో అడిగిన మొత్తం 61 ప్రశ్నల్లో సుమారు 50 ప్రశ్నలు దర్శన్ హిరానందాని, ఆయన కంపెనీ వ్యాపార ప్రయోజనాలను పరిరక్షించేందుకు అడిగినట్లుగా దూబే ఆరోపించారు.