ముంబై, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) వేగంగా అడుగులు వేస్తున్నది. భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం ఫార్ములా దాదాపుగా ఖరారైంది. లోక్సభ ఎన్నికల్లో లభించిన విజయాల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తున్నది. ముంబైలోని 90 శాతం సీట్లలో ఏకాభిప్రాయం కుదిరిందని ఎంవీఏ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం జరిగిన ఎంవీఏ సమావేశంలో కాంగ్రెస్ 115 సీట్లు కావాలని పట్టుబట్టగా, శివసేన (యూబీటీ) కనీసం 100 సీట్లు కావాలని పట్టుబట్టినట్లు సమాచారం. అయితే చివరికి కాంగ్రెస్ 105 స్థానాల్లో, ఉద్ధవ్ గ్రూపు 95 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తున్నది. ముంబైలో 23 స్థానాలు ఇవ్వాలని శివసేన (యూబీటీ) డిమాండ్ చేయగా, 22 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. మిగిలిన 14 స్థానాలు కాంగ్రెస్,ఎన్సీపీ పంచుకోవలసి ఉంటుంది.