ముంబై, జనవరి 15: భారత నౌకాదళంలోకి సరికొత్త అస్ర్తాలు చేరాయి. అధునాతన యుద్ధనౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరితో పాటు ఐఎన్ఎస్ వాఘ్షీర్ జలాంతర్గామిని బుధవారం జలప్రవేశం చేశారు. ముంబైలోని నేవల్ డాక్యార్ట్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ వీటిని జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ సూరత్.. శత్రు నౌకలను ధ్వంసం చేసేందుకు ఉద్దేశించిన పీ15బీ ప్రాజెక్టులో నాలుగవది.
ఇందులో అధునాతన ఆయుధ, రాడార్ వ్యవస్థలు ఉన్నాయి. ఐఎన్ఎస్ నీలగిరి.. పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక. ఇందులో శత్రువుల కళ్లుగప్పే స్టెల్త్ పరిజ్ఞానం ఉన్నది. ఇక ఐఎన్ఎస్ వాఘ్షీర్.. పీ 75 ప్రాజెక్టులో ఆరో, చివరి జలాంతర్గామి. డీజిల్-విద్యుత్తుతో నడిచే ఈ జలాంతర్గామి సముద్రంలోపల నుంచే కాక పైనుంచి కూడా ప్రత్యర్థులతో యుద్ధం చేయగలదు. నిఘా సమాచారాన్ని బహుళార్థకంగా సేకరించగలదు.