Uttarakhand Avalanche : ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని చమోలి జిల్లా మనా గ్రామంలో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. రెస్క్యూ సిబ్బంది మంచుదిబ్బల కింద నుంచి ఆదివారం మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. రెండు రోజుల క్రితం బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కార్మికుల శిబిరంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ఆచూకీ దొరకని మరో మృతదేహం కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. బీఆర్వో కార్మికులు మంచు తొలగించే పనుల్లో ఉండగా మంచు చరియలు విరిగిపడి 58 మంది అందులో కూరుకుపోయారు. వెంటనే ఆర్మీ, సహాయక బృందాలు రంగంలోకి దిగి 54 మందిని కాపాడారు. వారిని ఎయిర్లిఫ్ట్తో జోషి మఠ్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. వారిలో తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులు చికిత్స పొందుతూ మృతిచెందారు.
ఆచూకీ దొరకని మిగతా నలుగురి కోసం గాలింపు కొనసాగించగా.. ఇవాళ ఉదయం మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. మరో కార్మికుడి జాడ తెలియాల్సి ఉంది. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనేందుకు జోషిమఠ్ నుంచి మరో ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. థర్మల్ ఇంజిన్ కెమెరా సాయంతో మంచులో చిక్కుకున్న వారి కోసం గాలించారు.