Arrests : కోయింబత్తూర్ (Coimbatore) ఎయిర్పోర్టు (Airport) సమీపంలో కాలేజీ విద్యార్థినిని కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. నేరానికి పాల్పడిన సమయంలో నిందితులు ముగ్గురూ మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం కోయింబత్తూరులోని ఎయిర్పోర్టు సమీపంలో ఆదివారం రాత్రి 10.40 గంటల సమయంలో ఓ కాలేజీ విద్యార్థిని తన స్నేహితుడితో కారులో ఉండగా నిందితులు తవాసీ, కార్తీక్, కాళీశ్వరం వారిని అటకాయించారు. కారు అద్దాలు పగులగొట్టి బాధితురాలి స్నేహితుడిపై కొడవలితో దాడిచేశారు.
అనంతరం విద్యార్థినిని దూరంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇతంలో ఆమె స్నేహితుడి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకోవడాన్ని గమనించిన నిందితులు గోడదూకి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని మూడు లోకేషన్లలో గుర్తించి ఇవాళ అరెస్ట్ చేశారు.
నిందితులు ముగ్గురిపై హత్యలు, దొంగతనాలు తదితర కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరు ఇతర కేసులలో అరెస్టయ్యి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారని చెప్పారు. అదేవిధంగా నిందితుల్లో ఇద్దరు సొంత అన్నదమ్ములని, మరో వ్యక్తి వారికి బంధవు అని వెల్లడించారు.