Bus Accident | జార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లా పరిధిలో శనివారం రాత్రి ప్రమాదం సంభవించింది. రాంచీ నుంచి గిరిధ్ వెళుతున్న బస్సు శనివారం రాత్రి 8.40 గంటల సమయంలో బరాకర్ నదిపై గల వంతెన మీద నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో 24 మంది గాయ పడ్డారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదని, సహాయ, చర్యలు చేపట్టామని గిరిధ్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. ముగ్గురు మరణించారని, 24 మందికి గాయాలయ్యాయని గిరిధ్ జిల్లా దవాఖాన సివిల్ సర్జన్ డాక్టర్ ఎస్పీ మిశ్రా తెలిపారు.
ఈ ఘటనపై జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ స్పందించారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. రాంచీ నుంచి గిరిధ్ వెళుతున్న బస్సు.. బరాకర్ నదిలో పడిపోవడం విచారకరం అని ట్వీట్ చేశారు. జిల్లా అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టిందని తెలిపారు.