న్యూఢిల్లీ: మాలిలోని సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు భారతీయులను అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసినట్టు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. పశ్చిమ మాలిలోని కైస్ ప్రాంతంలో ఉన్న డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై జూలై 1న సాయుధులైన ఆగంతకులు దాడి చేసినట్టు సమాచారం.
అల్‌ఖైదాతో సంబంధాలున్న జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిం(జేఎన్ఐఎం) మాలిలో పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడగా, ఈ దాడి వెనుక కూడా ఈ సంస్థే ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. తక్షణమే మాలి ప్రభుత్వం ఉగ్రవాదుల చెర నుంచి కార్మికులను సురక్షితంగా విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది.