భోపాల్: మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) మౌగంజ్ జిల్లాలో దారుణం జరిగింది. మంచి నీటి కోసం వెళ్లిన బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన ముగ్గురు సామూహిక లైంగికదాడి చేశారు. నిందితుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉండటం గమనార్హం. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గురువారం సాయంత్రం 6 గంటలకు మంచినీటి కోసం బాలిక తమ ఇంటి సమీపంలో ఉన్న బోరింగు వద్దకు వెళ్లింది. మైనర్ బాలుడితో సహా అక్కడే ఉన్న మరో ఇద్దరు ఆ బాలికను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరు ఆమెపై లైంగిక దాడి చేశారు. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను పొలంలో వదిలి వెళ్లారు.
అయితే బాలిక ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు వెతుకుండగా, పొలంలో అపస్మారక స్థితిలో కనబడింది. హుటాహుటిన బాదితురాలిని దవాఖానకు తరలించారు. అనంతరం లౌర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం నిందితులను ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.