Road accident: పాల ట్యాంకర్ అదుపుతప్పి జనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు. సిక్కిం రాష్ట్రం గ్యాంగ్‌టక్ జిల్లాలోని రాణిపూల్ మేళా మైదానంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. సిక్కింగ్ రాజధాని గ్యాంగ్‌టక్‌కు 11 కిలోమీటర్ల దూరంలోని రాణిపూల్ మేళా గ్రౌండ్లో శనివారం రాత్రి టొంబోలా ఆడేందుకు జనం భారీగా వచ్చారు. అటుగా వచ్చిన ఓ పాల ట్యాంకర్ అదుపుతప్పి మైదానంలోని జనంపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో మొత్తం 19 మంది గాయపడ్డారు.
స్థానికులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో మొత్తం ముగ్గురు మరణించినట్లయ్యింది. అయితే గాయపడిన వారిలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, ప్రమాదంపై సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ స్పందించారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.