Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతున్నది. త్వరలో మధ్యప్రదేశ్‌లో ప్రవేశించనున్నది. యాత్ర మధ్యప్రదేశ్‌లో ప్రవేశించిన అనంతరం పేలుళ్లు జరిపి.. రాహుల్‌ను చంపేస్తామని బెదిరింపు లేఖ వచ్చింది. ఇండోర్ నగరం జుని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్వీట్ షాప్ వద్ద ఈ లేఖను గుర్తించారు. రాహుల్ యాత్ర ఇండోర్‌లోకి ప్రవేశించిగానే.. పేలుళ్లకు పాల్పడుతామని లేఖలో హెచ్చరించారు. రాహుల్‌తో పాటు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌కు సైతం బెదిరింపులు వచ్చాయి.
బెదిరింపు లేఖతో పోలీసులు అప్రత్తమయ్యారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే, బెదిరింపు లేఖలపై కమల్‌నాథ్ స్పందించారు. యాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. రాహుల్ గాంధీ యాత్ర నవంబర్ 23న మధ్యప్రదేశ్ ఖల్సాకు చేరనున్నది. సమాచారం మేరకు.. లేఖలో ‘ఇండోర్ నగరంలోని పలు చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడుతాం. నిన్ను (రాహుల్ గాంధీ) మీ తండ్రి రాజీవ్ గాంధీ దగ్గరకు పంపిస్తాం. సిక్కు అల్లర్లకు కారణమైన కమల్‌నాథ్‌ను కాల్చి చంపుతాం’ అని ఆ లేఖలో రాసినట్టు పోలీసులు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, లేఖ దొరికిన మిఠాయి దుకాణానికి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
బెదిరింపులు ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నట్లుగా పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. గురువారం సాయంత్రం జూని ఇండోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు ఇండోర్ డీఎస్పీ రాజేష్ సింగ్ తెలిపారు. రాహుల్ గాంధీకి వచ్చిన బెదిరింపు లేఖపై అరుణ్ యాదవ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి భయం లేదని, దేశ ఐక్యత, సద్భావన, సౌభ్రాతృత్వాన్ని ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కృషి చేస్తోందని, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు కాంగ్రెస్ భయపడడం లేదన్నారు. బెదిరింపు లేఖలు రాసిన వారిపై పోలీసులు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.