Shehnaaz Gill | బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ తండ్రికి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె తండ్రి సంతోక్ సింగ్ స్వయంగా వెల్లడించారు. రూ.50లక్షలు డిమాండ్ చేశారని.. లేకపోతే చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలిపారు. పాకిస్తాన్కు చెందిన నంబర్ నుంచి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సదరు వ్యక్తి పాక్కు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకొని రూ.50లక్షలు డిమాండ్ చేసినట్లు చెప్పారు. ‘తమ వద్ద మీరు ఎక్కడ నివస్తున్నారు ? ఏం చేస్తున్నారనే సమాచారం అంతా ఉంది. మీ కూతురు చాలా డబ్బు సంపాదించింది. రూ.50లక్షలు ఇస్తే మంచిది. లేకపోతే మీకు శివసేన నేత సుధీర్ సూరి పరిస్థితిలా మారుతుంది’ అని హెచ్చరించినట్లుగా పేర్కొన్నారు.
అయితే, నవంబర్ 5, 2022న అమృత్సర్లో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో శివసేన నేత సుధీర్ సూరిని పట్టపగలే హత్యకు గురయ్యారు. బెదిరింపులపై పోలీసులను వివరణ కోరగా.. ఇప్పటి వరకు తమకు ఫిర్యాదు అందలేదని బియాస్ పోలీస్స్టేషన్ ఇన్చార్జి గురీందర్ సింగ్ తెలిపారు. ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామన్నారు. సంతోఖ్ సింగ్కు ఇప్పటికే భద్రత కల్పించామని తెలిపారు. ఇదిలా ఉండగా.. షెహనాజ్ గిల్ తండ్రి సంతోఖ్ సింగ్ 2021లో బీజేపీలో చేరారు. ఆయనకు 2022లోనూ గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తామని బెదిరించారు. అంతకుముందు 2021లోనే బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆయన కారుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదైంది.